Janasena: జనసేనకే గాజు గ్లాసు గుర్తు.. హైకోర్టు తీర్పు

  • ఫ్రీ సింబల్స్ లిస్టులో గాజు గ్లాసు గుర్తు 
  • గుర్తు కోసం న్యాయపోరాటం చేసిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ
  • పిటిషన్ కొట్టివేత.. జనసైనికుల హర్షం 
AP High Court dismissed the petition About Janasena Party Symbol

జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఊరట కల్పించింది. పార్టీ సింబల్ పై దాఖలైన పిటిషన్ ను తోసిపుచ్చింది. దీంతో గాజు గ్లాసు గుర్తు జనసేనకే చెందనుంది. ఈమేరకు మంగళవారం ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించింది. గాజు గ్లాసు కోసం తాము దరఖాస్తు చేసుకుంటే ఎన్నికల కమిషన్ (ఈసీ) నిబంధనలకు విరుద్ధంగా దానిని జనసేనకు కేటాయించిందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం తీర్పును వెలువరించనున్నట్లు వెల్లడించింది. 

గాజు గ్లాసు సింబల్ ను ఎన్నికల కమిషన్ ఫ్రీ సింబల్స్ లిస్టులో పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఓవైపు ఈ గుర్తు కోసం ఇటు జనసేన, అటు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ న్యాయపోరాటం చేస్తుండగా ఈసీ ఆ గుర్తును ఫ్రీ సింబల్స్ లిస్టులో పెట్టడం గమనార్హం. తాజాగా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పుతో గాజు గ్లాసును జనసేన పార్టీకి కేటాయిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేయనుందని తెలుస్తోంది. కాగా, ఏపీ హైకోర్టు తీర్పుతో గ్లాసు గుర్తు తమకే దక్కడంపై జనసైనికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News